
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి నాయకత్వం సమన్వయంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.
కూటమి నేతలతో సమీక్ష నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, పార్టీల మధ్య సమన్వయంపై పలు సూచనలు చేశారు. కూటమి తరఫున అధికారికంగా బీ-ఫారాలు పొందిన అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ అధికారిక అభ్యర్థులకు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేశారు. పార్టీల నుంచి అధికారిక బీ-ఫారాలు పొందకుండా ఎన్నికల బరిలో నిలిచిన వారు వెంటనే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని సూచించారు. అలాగే, కూటమి నాయకత్వం ఆమోదం లేకుండా పోటీలో కొనసాగుతున్న అభ్యర్థులు ఎన్నికల నుంచి తప్పుకోవాలని నేతలు పేర్కొన్నారు.
అధినాయకత్వం నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ప్రస్తుతం టికెట్లు లభించని నాయకులకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అవకాశాల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, వీవీఎన్ మాధవ్ భరోసా ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక ఎన్నికల్లో కూటమి నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు.
