
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పటికే టెండర్లు పిలవగా.. తాజాగా ఓఆర్‌ఆర్‌లో ఏర్పాటు చేయనున్న ఇంటర్‌ఛేంజ్‌లపై స్పష్టత వచ్చింది. మొత్తం 17 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు.
189.93 కిలోమీటర్ల ప్రధాన ఓఆర్‌ఆర్‌తో పాటు నారా కోడూరు నుంచి బుడంపాడు వరకు 5.2 కిలోమీటర్ల నాలుగు వరుసల స్పర్ రోడ్డును నిర్మించనున్నారు. దీంతో మొత్తం ప్రాజెక్టు పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుతుంది. ఆరు వరుసలతో యాక్సెస్ కంట్రోల్డ్ విధానంలో ఓఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు.
17 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు
ఓఆర్‌ఆర్‌లోకి వాహనాలు ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 8 డబుల్ ట్రంపెట్, ఒక సింగిల్, 8 రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు ఉంటాయి. ఓఆర్‌ఆర్ ఆరు చోట్ల జాతీయ రహదారులను క్రాస్ చేయనున్న నేపథ్యంలో అక్కడ డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర, జిల్లా రహదారులు కలిసే ప్రాంతాల్లో సింగిల్, రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తారు.
ప్రారంభంలో 19 ఇంటర్‌ఛేంజ్‌లను ప్రతిపాదించినప్పటికీ ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించే క్రమంలో వాటిని 17కి పరిమితం చేశారు. ఓఆర్‌ఆర్ లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. బయటివైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనలను తొలగించారు. తెనాలి నుంచి కాజ వరకు ప్రతిపాదించిన రహదారితో పాటు అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న రెండు ఇంటర్‌ఛేంజ్‌లను కూడా రద్దు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.30,491 కోట్లకు తగ్గింది.
ప్రధాన ఇంటర్‌ఛేంజ్‌ల ప్రాంతాలు
- కంచికచర్ల సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై తొలి డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.
- పొన్నవరం సమీపంలో కంచికచర్ల–మధిర రాష్ట్ర రహదారిపై రోటరీ ఇంటర్‌ఛేంజ్.
- దుగ్గిరాలపాడు వద్ద విజయవాడ–ఖమ్మం–నాగ్‌పూర్ హైవేపై డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.
- మైలవరం సమీపంలో ఓఆర్‌ఆర్ 31.29 కిలోమీటర్ వద్ద మరో డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.
- అడవినెక్కలం–వెల్వడం రోడ్డు వద్ద రోటరీ ఇంటర్‌ఛేంజ్.
- ఆగిరిపల్లి సమీపంలో డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.
- పొట్టిపాడు సమీపంలో చెన్నై–కోల్‌కతా హైవేపై డబుల్ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్.
- నున్నవరం–పుట్టగుంట రోడ్డు క్రాసింగ్ వద్ద రోటరీ ఇంటర్‌ఛేంజ్.
