ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసి అల్పాహారం చేస్తూ స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపైనా నేతలు చర్చించనున్నట్లు సమాచారం.

పర్సంటేజీల ప్రాతిపదికన కాకుండా ఏ పార్టీకి ఏ ప్రాంతంలో బలం ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా పొత్తులు కొనసాగించాలని కూటమి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు.

ఏ ఒక్క స్థానాన్ని కూడా వైసీపీకి దక్కకుండా చూడాలని కూటమి నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. తొలి దశలో జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రాబోయే శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం.

By Rajini