ఒకప్పుడు దేశీయ శీతల పానీయాల మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘గోల్డ్ స్పాట్’ మరోసారి వినియోగదారుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దాదాపు 26 ఏళ్ల క్రితం మార్కెట్‌కు దూరమైన ఈ పానీయం.. వచ్చే వారం నుంచి కొత్త రూపంలో అందుబాటులోకి రానుందని ప్రచారం జరుగుతోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని కోకా-కోలా ఇండియా ఈ బ్రాండ్‌ను మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

లో-షుగర్ లేదా జీరో-షుగర్ రూపంలో..

ప్రస్తుతం మార్కెట్‌లో తక్కువ చక్కెర, చక్కెర లేని పానీయాలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ స్పాట్‌ను లో-షుగర్ లేదా జీరో-షుగర్ విభాగంలో రీలాంచ్ చేయనున్నట్లు సమాచారం. ‘ది జింగ్ థింగ్’ అనే ట్యాగ్‌లైన్‌తో 1980ల నాటి గుర్తును గుర్తుచేసేలా కొత్త రూపంలో తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రీలాంచ్‌కు సంబంధించి గోల్డ్ స్పాట్ క్యాన్లతో భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ఆయన భార్య సాక్షి కనిపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో పాత బ్రాండ్ మళ్లీ మార్కెట్లోకి వస్తుందన్న వార్తపై ఆసక్తి పెరిగింది.

1993లో కోకా-కోలా చేతికి..

గోల్డ్ స్పాట్ చరిత్రలో 1993 కీలక మలుపుగా నిలిచింది. అప్పట్లో పార్లే బిస్లరీ అధినేత రమేష్ చౌహాన్ నుంచి థమ్స్ అప్, లిమ్కా, మాజా, గోల్డ్ స్పాట్ బ్రాండ్లను కోకా-కోలా కొనుగోలు చేసింది. ఆ తర్వాత తన అంతర్జాతీయ ఆరెంజ్ డ్రింక్ బ్రాండ్ ఫాంటా విక్రయాలను విస్తరించే వ్యూహంలో భాగంగా 2000 సంవత్సరంలో గోల్డ్ స్పాట్ అమ్మకాలను నిలిపివేసింది.

ఫాంటాకు పోటీ లేకుండా కొత్త వ్యూహం?

ఇప్పుడు గోల్డ్ స్పాట్‌ను మళ్లీ తీసుకొస్తే ఫాంటా అమ్మకాలపై ప్రభావం పడకుండా కోకా-కోలా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా గోల్డ్ స్పాట్‌ను తక్కువ చక్కెర లేదా చక్కెర రహిత పానీయాల విభాగంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే రీలాంచ్ తేదీ, కొత్త ఉత్పత్తి ధర, రుచిలో మార్పులు, అందుబాటులో ఉండే ప్రాంతాలపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే గోల్డ్ స్పాట్ కొత్త రూపంలో తిరిగి వస్తే.. పాత తరం వినియోగదారులతో పాటు కొత్త తరం వారినీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *