
టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోందంటూ వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అయితే గత వారం గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో కొన్ని సంస్థాగత మార్పులు చేసినట్లు అంగీకరించింది. ఈ క్రమంలో సుమారు 30 ఉద్యోగ బాధ్యతలను (రోల్స్) తొలగించినట్లు వెల్లడించింది. అయితే ఈ మార్పుల ప్రభావం ఏయే టీమ్‌లపై పడిందనే వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
30 రోల్స్ తొలగింపు మాత్రమే..
సోషల్ మీడియాలో గూగుల్ లేఆఫ్స్‌పై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు గూగుల్ క్లౌడ్ ఇండియా అధికారిక ఖాతా స్పందించింది. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. పని ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగా గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో పరిమిత స్థాయిలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే సుమారు 30 రోల్స్‌ను తొలగించినట్లు పేర్కొంది.
24 గంటల్లో రాజీనామా చేయాలంటూ ప్రచారం
ఇటీవల గూగుల్‌లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఉద్యోగులు 24 గంటల్లోగా రాజీనామా చేయాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరిస్తోందంటూ ప్రచారం జరిగింది. వచ్చే జనవరిలో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ క్లౌడ్ ఇండియా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వాస్తవంగా చేపట్టిన సంస్థాగత మార్పులకు మధ్య తేడా ఉందని స్పష్టం చేసింది. దీంతో భారత్‌లో గూగుల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చేపట్టిందనే వార్తలకు సంస్థ స్పందనతో స్పష్టత వచ్చినట్లయింది.



