ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. Motorola Edge 70 Neo పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గతంలో వచ్చిన Edge 50 Neoకు కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. 2024లో విడుదలైన Edge 50 Neo ప్రారంభ ధర రూ.23,999 కాగా.. కొత్త మోడల్ ధర మాత్రం రూ.35 వేల మార్కును దాటడం గమనార్హం.

144Hz రిఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే

Motorola Edge 70 Neoలో 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అందించారు. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కల్పించారు. అలాగే IP64 రేటింగ్‌తో పాటు MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ 16

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మోటో హెలో యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ మోడల్‌కు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

50MP ప్రధాన కెమెరా

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సదుపాయం ఉంది. దీనికి తోడు 2MP మ్యాక్రో కెమెరా, 3-ఇన్-1 లైట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32MP కెమెరాను అందించారు.

7,000mAh బ్యాటరీ ప్రత్యేకత

బ్యాటరీ విషయంలోనూ ఈ ఫోన్ ఆకట్టుకునే సామర్థ్యంతో వస్తోంది. ఇందులో 7,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ధర, ఆఫర్లు, విక్రయాల వివరాలు

Motorola Edge 70 Neoను 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో విడుదల చేశారు. దీని అసలు ధరను రూ.40,999గా నిర్ణయించారు. అయితే పరిచయ ఆఫర్‌లో భాగంగా తొలి పది రోజుల పాటు రూ.37,999కే విక్రయించనున్నారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఫోన్‌ను రూ.34,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

డిసెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్లు, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ మధ్యస్థాయి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *