
వ్యవసాయ పరిశోధనలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం, రైతులకు నూతన అవకాశాలు కల్పించడం, వ్యవసాయ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఎన్‌జీఆర్‌ఏయూ) కీలక ప్రణాళిక రూపొందించింది. పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర వ్యవసాయ రంగాలకు సంబంధించి రూ.63.08 కోట్ల అంచనా వ్యయంతో ఏడు ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా సహకారం పొందే అంశంపై ఐసీఐసీఐ ఫౌండేషన్ ప్రతినిధులతో విశ్వవిద్యాలయం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాజెక్టుల లక్ష్యాలు, అమలు విధానం, నిధుల అవసరాలు, వ్యవసాయ రంగానికి కలిగే ప్రయోజనాలపై చర్చించారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హెడ్ పి. సైమన్ రాజ్, ప్రోగ్రామ్ లీడర్ శిరీష ప్రతిపాదనలను పరిశీలించారు.
ఆధునిక పరిశోధనలకు ప్రాధాన్యం
వ్యవసాయ పరిశోధన, రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు, జల వనరుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ వినియోగం, విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత బోధన వంటి అంశాలతో ఏడు ప్రాజెక్టులను రూపొందించారు.
మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూ.6 కోట్లతో వరి వేగవంతమైన ప్రజనన పరిశోధన (రైస్ స్పీడ్ బ్రీడింగ్) సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల కొత్త వరి రకాల అభివృద్ధి, పరిశోధన ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూ.5 కోట్లతో సెన్సార్ ఆధారిత ఆటోమేటిక్ రెయిన్‌అవుట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా నియంత్రిత పరిస్థితుల్లో పరిశోధనలు నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.
యువతకు వ్యవసాయ నైపుణ్య శిక్షణ
వ్యవసాయ రంగంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.5 కోట్లతో ఆధునిక శిక్షణ సదుపాయాలు, ప్రదర్శనా యూనిట్లతో వ్యవసాయ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునేలా యువతకు శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. మిగిలిన ప్రాజెక్టుల ద్వారా కూడా పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని విశ్వవిద్యాలయం లక్ష్యంగా పెట్టుకుంది.




