
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవలె 7437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన రాగా.. తాజాగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే తేదీలను ఖరారు చేశారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 9 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కానిస్టేబుల్, ఎస్‌ఐ, ఫైర్‌ఫైటర్, వార్డర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఎస్సై పోస్టుకు రూ.1500, కానిస్టేబుల్ పోస్టుకు రూ.1200 చొప్పున అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. మొత్తం 7,437 పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 19వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని.. ఇతర విధానాల్లో పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్ఎల్‌పీఆర్‌బీ స్పష్టం చేసింది.
ఇటీవల పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 4 వేర్వేరు నోటిఫికేషన్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) 3,697.. ఏఆర్ కానిస్టేబుల్ 1,052.. ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ 1,380.. ఫైర్ ఫైటర్ 751.. జైలు వార్డర్ 208 పోస్టులు ఉండగా.. సబ్ ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఏఎస్సై వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగానే ఫిజికల్, మెడికల్ రూల్స్ చెక్ చేసుకోవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారులు సూచించారు. అలాగే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమీలేయర్, స్థానికత, ఇతర ప్రత్యేక కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఆయా సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలని తెలిపింది.

