
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు దొనకొండ నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండగా.. తాజాగా దొనకొండకు బదులుగా మార్కాపురం నుంచి ఒంగోలుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే సూచనలు వస్తున్నాయి.
ప్రస్తుతం దొనకొండ–ఒంగోలు మధ్య 119.6 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కు రైల్వేశాఖ ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే మార్కాపురం నుంచి లైన్ ఏర్పాటు చేస్తే మార్కాపురం–ఒంగోలు మధ్య కనెక్టివిటీ పెరగడంతో పాటు పలు ప్రాంతాలకు ప్రయోజనం ఉంటుందని రైల్వే వినియోగదారుల కమిటీ సభ్యులు చెబుతున్నారు.
పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రయోజనం
దొనకొండ ప్రాంతంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు, రామాయపట్నం పోర్టుకు రైలు కనెక్టివిటీ కీలకంగా మారనుంది. మార్కాపురం నుంచి వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు, పలకలు, ఎరువులను రైళ్ల ద్వారా రవాణా చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
శ్రీశైలం భక్తులకు ఉపయోగం
మార్కాపురం నుంచి ఒంగోలుకు రైల్వే లైన్ వస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మార్కాపురం వరకు రైలులో చేరుకుని అక్కడి నుంచి బస్సులో శ్రీశైలం వెళ్లవచ్చు.
అలాగే మార్కాపురం జిల్లా పరిధిలోని భైరవకోన, నెమలిగుండ్ల రంగనాథస్వామి ఆలయం, త్రిపురాంతకం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. పొదిలి ప్రాంతానికి ఒంగోలుతో రైలు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది.
మార్కాపురానికి రైలు సేవల విస్తరణపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు రైల్వే వినియోగదారుల కమిటీ సభ్యులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్రతిపాదనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
