• రాష్ట్రంలో గత పాలనలో విధ్వంసం జరిగిందని దాన్ని సరిచేస్తామని ఎన్నికల సమయంలోనే ప్రజలకు హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి జల్‌జీవన్ మిషన్ 2.0–అమరజీవి జలధార పనులను ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టినట్లు తెలిపారు. మదనపల్లెను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమ దశ, దిశ మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
  • కర్మయోగి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచుతామని చంద్రబాబు తెలిపారు. పాన్‌-ఐఐటీ కార్యక్రమం ద్వారా సాంకేతిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, పాన్‌-ఐఐటీ కౌన్సిల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కడప అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని విమర్శించారు.
  • ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల మేర నిధులు సాధించిందని ఏపీ కంటే చిన్న రాష్ట్రమైన అసోం రూ.34 వేల కోట్లు పొందిందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం రూ.2,016 కోట్ల మేర నిధులు తీసుకుందని ఆరోపించారు. గత పాలన నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని విమర్శించారు.
  • గోదావరి–కావేరి నదుల అనుసంధానం తన ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. కరవు పరిస్థితుల్లోనూ సుమారు 2 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని చెప్పారు. నదుల అనుసంధానం పూర్తయితే నాలుగు రాష్ట్రాల్లో సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

By Rajini