• ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
  • తాజా పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధన లేదని పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల కారణంగా గ్రామీణ స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 61.08 శాతానికి చేరుతున్నప్పటికీ, పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రం 49.24 శాతానికే పరిమితమవుతున్నాయని వివరించింది.
  • అయినప్పటికీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ప్రాతిపదికగా తీసుకుని హైకోర్టు రెండు జీవోలను కొట్టివేసిందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సమగ్ర గణాంకాలు, తగిన వివరాలు అందుబాటులో ఉంటే 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు కీలక తీర్పులను కూడా పిటిషన్‌లో ప్రస్తావించింది.
  • ఈ నేపథ్యంలో పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

By Rajini