హైదరాబాద్‌లో రూ.10 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నగరంలో 2,000కు పైగా అల్ట్రా లగ్జరీ ఇళ్లు విక్రయమైనట్లు క్రెడాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్‌లో 625 అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.

ఈ విభాగంలో బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో ఉండటం విశేషం. ముఖ్యంగా కోకాపేట, నానక్‌రామ్‌గూడ, మంచిరేవుల వంటి ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ఇళ్ల కొనుగోలుకు సంపన్నులు ఆసక్తి చూపుతున్నారు.

విశాలమైన అపార్ట్‌మెంట్లు, ప్రీమియం విల్లాలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ టవర్లకు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు కూడా ఈ విభాగంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ బడ్జెట్‌కు సరిపోయే సొంతింటి కోసం అన్వేషిస్తుంటే.. మరోవైపు సంపన్నులు మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న అల్ట్రా లగ్జరీ ఇళ్లకు నగరంలో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

విశాలమైన అపార్ట్‌మెంట్లు, ఐదు నుంచి ఆరు బెడ్‌రూమ్‌లతో కూడిన విలాసవంతమైన నివాసాలు, ప్రైవేట్ విల్లాలపై సంపన్నులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ వర్గాల గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో గత నాలుగేళ్లలో రూ.10 కోట్లకు పైగా విలువైన 2,000కు పైగా ఇళ్లు విక్రయమయ్యాయి.

కరోనా మహమ్మారి తర్వాత ఈ ఖరీదైన ఇళ్ల మార్కెట్ మరింత ఊపందుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఎక్కువ విస్తీర్ణం, వ్యక్తిగత గోప్యత, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఇళ్లకు సంపన్న కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ప్రీమియం సౌకర్యాలపై పెరుగుతున్న ఆసక్తి కూడా ఈ ట్రెండ్‌కు కారణంగా కనిపిస్తోంది.

క్రెడాయ్ (CREDAI) గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో రూ.10 కోట్లకు పైగా ధర కలిగిన ఇళ్ల విక్రయాలు 2021లో 184 యూనిట్లుగా ఉండగా.. 2025 నాటికి ఆ సంఖ్య 570 యూనిట్లకు చేరింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ విభాగంలో అమ్మకాలు గణనీయంగా పెరగడం.. హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నదానికి సంకేతంగా నిలుస్తోంది.

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లకు పైగా విలువైన 625 ఇళ్ల విక్రయాలు నగరంలో నమోదైనట్లు CRE Matrix, India Sotheby’s International Realty సంయుక్త నివేదిక వెల్లడించింది. ఈ ఇళ్ల కొనుగోళ్ల కోసం మొత్తం సుమారు రూ.8,562 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.

దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే కాలంలో బెంగళూరులో రూ.10 కోట్లకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు 125 మాత్రమే నమోదు కాగా, చెన్నైలో ఈ సంఖ్య 58గా ఉంది.

ఈ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్‌ అత్యంత ఖరీదైన నివాసాల మార్కెట్‌లో దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రూ.10 కోట్లకు పైబడిన ఇళ్ల విక్రయాల్లో ఇతర దక్షిణ భారత నగరాల కంటే హైదరాబాద్‌ భారీ ఆధిక్యం సాధించడం.. నగరంలో అల్ట్రా లగ్జరీ నివాసాలకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.