
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన ఘోర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై ‘టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్’ (TIL) కీలక వివరణ ఇచ్చింది.
శ్రీసిటీలో జరిగిన ప్రమాదానికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్ స్పష్టం చేసింది. సంస్థ పేరు, ప్రమాదానికి గురైన ఫ్యాక్టరీ పేరులో ఉన్న పోలికల కారణంగా కొన్ని అపోహలు, గందరగోళం ఏర్పడ్డాయని తెలిపింది.
శ్రీసిటీలో తమకు ఎలాంటి తయారీ యూనిట్ లేదని, ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ యాజమాన్యంతో తమ సంస్థకు ఎటువంటి కార్పొరేట్ సంబంధాలు లేవని వెల్లడించింది. పేరు పోలికల కారణంగా తమ సంస్థను ఈ ఘటనతో ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని ప్రజలు, మీడియా సంస్థలు గమనించి, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రచారం చేయాలని టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్ కోరింది. ప్రమాద ఘటనకు సంబంధించి సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాలని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీసిటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ తయారీ యూనిట్లో అక్టోబర్ 3న చోటుచేసుకున్న ఘోర బాయిలర్ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ఈ ఘటన అనంతరం ప్రమాదానికి గురైన ఫ్యాక్టరీ తమదేనంటూ సోషల్ మీడియాతో పాటు పలు వార్తా కథనాల్లో ప్రచారం జరుగుతుండటంతో రెండు ఫార్మా కంపెనీల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో తమ సంస్థపై జరుగుతున్న ప్రచారానికి ‘టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్’ కీలక స్పష్టతనిచ్చింది. శ్రీసిటీలో జరిగిన ఈ ప్రమాదానికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. సోషల్ మీడియా, వార్తా కథనాల్లో వస్తున్న సమాచారంపై వివరణ ఇచ్చింది.
శ్రీసిటీలోని ‘టీఐఎల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ యూనిట్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ‘టాబ్లెట్స్ ఇండియా’ స్పష్టం చేసింది. అయితే రెండు కంపెనీల పేర్లు, ప్రారంభ అక్షరాలు దగ్గరగా ఉండటంతో కొందరు మీడియా సంస్థలు, వార్తా వేదికలు ఈ ప్రమాదం ‘టాబ్లెట్స్ (ఇండియా) లిమిటెడ్’ ఫ్యాక్టరీలో జరిగినట్లు పొరపాటుగా ప్రచురించాయని తెలిపింది.
తప్పుడు నివేదికల కారణంగా తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు ప్రజల్లో తీవ్ర అపోహలు ఏర్పడ్డాయని ‘టాబ్లెట్స్ ఇండియా’ పేర్కొంది.
