ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన వారి ఆవేశం తనకు అర్థమవుతోందని, అయితే రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన సభలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని సూచించారు.

యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలని, అవతలి వారు హద్దులు దాటినప్పుడే ప్రతిఘటించాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గొడవలు వచ్చినా, హద్దులు మీరినా తాను కచ్చితంగా యుద్ధం చేస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తన దృష్టి రాయలసీమ అభివృద్ధిపైనే ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలపై మాట్లాడతానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో తన ప్రసంగాలు మరో విధంగా ఉంటాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొడవలు, యుద్ధం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయ అంశాలపై మాట్లాడతానని పేర్కొన్నారు. అవతలి వారు హద్దులు దాటినప్పుడే మన నోరు, గొంతు కట్టలు తెంచుకుంటాయని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఇది శాంతి సమయమని, ప్రజలకు అభివృద్ధి అందించాల్సిన సమయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అయినా, వైసీపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అరకు అయినా అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం వివక్ష చూపదని అన్నారు. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.

రాయలసీమ పౌరుషానికి తగిన విధంగా తాను మాట్లాడటం లేదని గతంలో కొందరు విమర్శించారని, అయితే ప్రస్తుతం రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నానని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయపరమైన పరిస్థితులు ఏర్పడితే తాను ఎలా స్పందిస్తానో అందరికీ తెలుసన్నారు. గొడవలు, కొట్లాటలు, గొడ్డలిపోట్లు కాకుండా అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

రాయలసీమ యువత భవిష్యత్తు బాగుండాలని, వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల మదనపల్లిలో కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తుచేశారు. ప్రజల ఆశీస్సులు, మద్దతు వల్లే ఇలాంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నామని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసి, వెన్నంటి నిలిచినందుకు కృతజ్ఞతగా రాష్ట్రంలో రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో ‘అమరజీవి జలధార–జల్ జీవన్ మిషన్’ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు తాగునీరు తాగే ప్రతిసారీ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.30,106 కోట్ల నిధులతో 50,315 పనులను చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 24,601 ఆవాసాల్లో 61.60 లక్షల కుళాయి కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా మరో 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను ప్రతి ఇంటికీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బృహత్తర కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జల్ జీవన్ మిషన్ పథకానికి గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేరళ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనుల కోసం రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కోరితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019-24 మధ్య కాలానికి కేవలం రూ.26 వేల కోట్ల ప్రతిపాదనలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఆ ప్రతిపాదించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐదేళ్ల కాలంలో కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదని ఆరోపించారు.

జల్ జీవన్ మిషన్ పథకం 2024తో ముగుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో ప్రత్యేకంగా స్పష్టం చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశం ఉండదని తెలిసినా, నాటి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాకపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిసినా, గత ప్రభుత్వం ఈ అంశంపై తగిన శ్రద్ధ చూపలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.