గుంటూరు నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (UCSF)కు ఏకంగా 1 మిలియన్‌ డాలర్లను విరాళంగా అందజేశారు.

డాక్టర్ శ్రీమన్నారాయణ దంపతులు అందించిన ఈ విరాళాన్ని పెట్టుబడిగా ఉంచి, దాని ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే వినియోగించనున్నారు. ఈ ఆదాయాన్ని అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించి, వారి ఉన్నత విద్యకు అండగా నిలవనున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేలా వారు తీసుకున్న ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

UCSFకు గుంటూరు దంపతుల భారీ విరాళం

అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (UCSF)కు 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు) భారీ విరాళంగా ప్రకటించారు.

కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు ఈ విరాళాన్ని అందజేశారు. వైద్య విద్యను ప్రోత్సహించడంతో పాటు వైద్య పరిశోధనలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అంబటి దంపతులు ఈ భారీ విరాళాన్ని అందించారు.

వైద్య రంగ అభివృద్ధికి అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు అందిస్తున్న సహకారాన్ని UCSF డీన్ డాక్టర్ జోస్ ఎమ్. భారల్ సాంచేజ్ ప్రశంసించారు. వారి దాతృత్వం భవిష్యత్ తరాల వైద్య విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు.

శ్రీమన్నారాయణ దంపతులు అందజేసిన విరాళం ఎండోమెంట్ ఫండ్‌లో శాశ్వత నిధిగా కొనసాగుతుందని డీన్ డా. సాంచేజ్ తెలిపారు. ఈ మొత్తాన్ని పెట్టుబడిగా ఉంచి, దాని ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే వినియోగిస్తామని వెల్లడించారు. ఈ ఆదాయాన్ని విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో అందించడంతో పాటు, గ్రామీణ వైద్యం, కుటుంబ వైద్యం తదితర రంగాల్లో వినూత్న పరిశోధనలకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ నిధి భావితరాల వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

తన మాతృభూమి భారతదేశంతో పాటు, తనను ఆదరించి ఉన్నత స్థాయికి చేర్చిన అమెరికా సమాజానికి కూడా తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు డాక్టర్ శ్రీమన్నారాయణ తెలిపారు. 1986 నుంచి UCSF (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో)లో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని గుర్తుచేశారు.

తమ కుటుంబం అమెరికాలో దాదాపు 40 ఏళ్లుగా నివసిస్తోందని, తనకు UCSF ఎంతో గుర్తింపును అందించడంతో పాటు వైద్యుడిగా స్థిరపడేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించిందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. తన సతీమణి అందించిన ప్రోత్సాహం, సహకారంతోనే తాను ఈ సమాజం నుంచి పొందిన దానిలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి అందించాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ శ్రీమన్నారాయణ వెల్లడించారు.