
హైదరాబాద్‌లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి షట్టర్‌ను ధ్వంసం చేసిన దుండగులు షోరూమ్‌లోకి చొరబడి సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను అపహరించినట్లు సమాచారం. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. మరోవైపు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దుండగుల కోసం గాలింపు చేపట్టాయి. షోరూమ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగల కదలికలను గుర్తించి, వారిని త్వరలోనే పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మేడిపల్లిలో భారీ నగల చోరీ.. రూ.2 కోట్లకు పైగా ఆభరణాలు అపహరణ
హైదరాబాద్‌లో భారీ నగల చోరీ కలకలం రేపింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్‌ను గుర్తుతెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. షోరూమ్‌లోకి చొరబడిన దొంగలు సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను అపహరించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవేపై బోడుప్పల్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ షోరూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు.. అనంతరం డిస్ప్లే గ్లాస్‌లను పగలగొట్టి అందులో ఉంచిన విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
చోరీపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షోరూమ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చోరీకి గురైన ఆభరణాల పూర్తి విలువ, ఎంతమేర నగలు అపహరణకు గురయ్యాయన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
చోరీకి గురైన నగల మొత్తం ఎంత? వాటి కచ్చితమైన విలువ ఎంత? అనే అంశాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత అధికారికంగా తేలాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో షోరూమ్ వద్ద భద్రతా సిబ్బంది ఉన్నారా? దొంగలు ఎంతసేపు షోరూమ్‌లో ఉన్నారు? అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
చోరీ విషయం వెలుగులోకి రావడంతో మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
