
సల్మాన్ ఖాన్, అక్కినేని నాగార్జున వంటి పలువురు స్టార్ హీరోలు సినిమాలతో పాటు రియాలిటీ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో ప్రముఖ నటుడు చేరబోతున్నారు. తమిళ నటుడు ఆర్. మాధవన్ త్వరలో బుల్లితెరపై హోస్ట్‌గా సందడి చేయనున్నారు.
‘గేమ్ ఛేంజర్స్: మిడిల్ ఈస్ట్’కు హోస్ట్
ఇటీవల ‘ధురంధర్’, ‘జి.డి.ఎన్’ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న మాధవన్.. ఇప్పుడు ‘ది గేమ్ ఛేంజర్స్: మిడిల్ ఈస్ట్’ అనే బిజినెస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమాన్ని నిర్మిస్తున్న ఆప్టిమిస్టిక్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ఈ షోలో వివిధ దేశాలకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకులు కంటెస్టెంట్లుగా పాల్గొంటారు. తమ వ్యాపార ఆలోచనలు, ప్రణాళికలను అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్యానెల్ ముందు వివరించాల్సి ఉంటుంది. వారి ఐడియాలు, వ్యాపార సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల అవకాశాలు ఉండనున్నాయి.
దుబాయ్ వేదికగా కార్యక్రమం
పశ్చిమాసియా మార్కెట్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని దుబాయ్ కేంద్రంగా రూపొందించనున్నారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు కూడా ఈ షోను విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న మాధవన్.. తొలిసారి బిజినెస్ రియాలిటీ షో హోస్ట్‌గా ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
