• భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు కనిపిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒప్పందం ముందుకు సాగాలంటే ఇరు దేశాలు పరస్పరం కొంత రాయితీ ఇచ్చుకోవడం, రాజీ ధోరణిని అవలంబించడం అవసరమని, అయితే ప్రస్తుతం ఆ విషయంలో ఇరు వర్గాలకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
  • న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యూనిక్ లీడర్స్ మీటింగ్‌లో మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ డీల్ కోసం అవతలి దేశానికి ఇవ్వాల్సిన మినహాయింపుల విషయంలో ఇరు పక్షాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. చర్చల్లో ఇరు దేశాలు ఎంతవరకు రాజీ ధోరణిని ప్రదర్శిస్తాయన్నదానిపైనే తదుపరి పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
  • అమెరికాతో భారత్ వాణిజ్యం ఇప్పటికీ భారతదేశానికే అనుకూలంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్‌తో వాణిజ్యంలో తమకు లోటు ఏర్పడుతోందని భావిస్తున్న అమెరికా దాన్ని కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు. దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై జరుగుతున్న చర్చల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని మంత్రి అన్నారు.
  • సుంకాలు కూడా ఇలాంటి చర్చల్లో భాగమేనని, గతంలో ఉన్న మార్గదర్శకాలు కొనసాగుతున్నప్పటికీ సుంకాల విషయంలో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అయితే దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలే ప్రధాన మార్గమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిపుచ్చుకునే విధానాలను దేశాలు అన్వేషించాలని సూచించారు.
  • ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బహుళపక్ష ఒప్పందాల కంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని మంత్రి తెలిపారు. ఇలాంటి ఒప్పందాలే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని అనేక దేశాలు భావిస్తున్నట్లు చెప్పారు. భారత్యూ రోపియన్ యూనియన్ మధ్య కుదిరే ఒప్పందాన్ని కూడా తాను ద్వైపాక్షిక ఒప్పందంగానే పరిగణిస్తానని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

By Rajini