దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో ఫ్యూయల్‌ సర్‌చార్జీలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్‌ 6 నుంచి చేసే అన్ని కొత్త బుకింగ్‌లకు పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.

గత కొన్ని నెలలుగా ఏటీఎఫ్‌ ధరలు నిరంతరం పెరుగుతున్నాయని ఇండిగో పేర్కొంది. గత నెలతో పోలిస్తే తాజాగా ఇంధన ధరలు 14 శాతానికిపైగా పెరిగాయని, దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక పెరుగుదల అని తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధన వ్యయం కీలకమైనందున, ఈ పెరుగుదల మొత్తం విమానయాన రంగంపై ప్రభావం చూపుతోందని వెల్లడించింది.

దేశీయ ప్రయాణాలకు కొత్త సర్‌చార్జీలు

  • 500 కి.మీ వరకు: రూ.375
  • 501–1,000 కి.మీ: రూ.600
  • 1,001–1,500 కి.మీ: రూ.900
  • 1,501–2,000 కి.మీ: రూ.1,150
  • 2,000 కి.మీ దాటితే: రూ.1,300

అంతర్జాతీయ మార్గాల్లో..

సార్క్‌ దేశాలకు ప్రయాణ దూరాన్ని బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఫ్యూయల్‌ సర్‌చార్జీ వసూలు చేయనున్నారు. సౌత్‌ఈస్ట్‌ ఏషియా, గల్ఫ్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు రూ.5,500, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు రూ.6,000గా నిర్ణయించారు.

పెరిగిన ఇంధన వ్యయాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు మరింత అధికంగా ఛార్జీలు పెంచాల్సి ఉన్నప్పటికీ, ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పరిమితంగానే సర్‌చార్జీలను సవరించినట్లు ఇండిగో తెలిపింది.

By Ramya