సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్, అసభ్యకరమైన డీఫేమింగ్ కంటెంట్‌ను వైరల్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు పలువురు నటీనటులు వ్యక్తిగతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వచ్చారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పరిశ్రమ మొత్తం ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాగవంశీ కీలక వ్యాఖ్యలు

ఈ అంశంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. సోషల్ మీడియాలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ కంటెంట్‌ను ప్రచారం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధితులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అడ్డుకోవాలంటే సినీ పరిశ్రమ తరఫున ఉమ్మడి నిర్ణయం అవసరమని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ను కలవనున్న పరిశ్రమ

మార్ఫింగ్, డీఫేమింగ్ కంటెంట్‌పై కఠినమైన చర్యలు తీసుకునేలా చట్టపరమైన రక్షణ అవసరమని టాలీవుడ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయించినట్లు నాగవంశీ తెలిపారు.

పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకుని.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న సైబర్ దాడులు, మార్ఫింగ్ వ్యవహారాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేలా కఠినమైన నిబంధనలు, శాశ్వత పరిష్కారం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమ భావిస్తోంది.

సోషల్ మీడియా పేరుతో హద్దులు దాటి వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు ఇకపై వ్యక్తిగత ఫిర్యాదులతో కాకుండా.. పరిశ్రమ మొత్తం కలిసి పరిష్కారం కోసం ప్రయత్నించనున్నట్లు నాగవంశీ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.