• వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి జగన్ మాట తప్పారని ఆరోపించారు.
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బుద్దా వెంకన్న తెలిపారు. నవంబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే వందల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అయితే ఓటమి భయంతోనే జగన్ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
  • జగన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన బుద్దా వెంకన్న బీసీలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ బీసీలకు ద్రోహం చేశారని ఆరోపించారు.
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అనేక ప్రయోజనాలు కల్పించామని వెంకన్న తెలిపారు. ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యం వంటి చర్యల ద్వారా పేదలకు ఆస్తి హక్కులు కల్పించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
  • వైసీపీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తూ వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు తమకు కీలకమని జగన్‌కు తెలుసని అందుకే ఎన్నికలు జరగకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
  • వైసీపీ నేతలు, కార్యకర్తలపై జగన్ ఒత్తిడి చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. పార్టీ ఉనికిని చాటుకునేందుకే ఎన్నికల్లో పోటీపై నేతలపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సమీకరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

By Rajini