
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌లో రిటైల్ వాహన విక్రయాలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో 25,36,920 యూనిట్లకు చేరినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించింది. ఆగస్టుతో పోలిస్తే అమ్మకాలు 4.69 శాతం పెరిగాయి.
సెప్టెంబర్‌లో నమోదైన 31.82 శాతం వార్షిక వృద్ధిని ‘లో-బేస్ ఎఫెక్ట్’ నేపథ్యంలో చూడాలని FADA సూచించింది. గత ఏడాది జీఎస్టీ 2.0 అమలుపై అంచనాలతో పలువురు వాహనాల కొనుగోళ్లను వాయిదా వేయడంతో 2025 సెప్టెంబర్‌లో అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మొత్తం రిటైల్ విక్రయాలు 1,55,12,319 యూనిట్లకు చేరగా, ఏడాది ప్రాతిపదికన 20.77 శాతం వృద్ధి నమోదైంది.
విభాగాల వారీగా చూస్తే ద్విచక్ర వాహనాలు 33.08 శాతం వృద్ధితో 17,90,188 యూనిట్లు, ప్యాసింజర్ వాహనాలు 32.10 శాతం పెరిగి 4,27,213 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 37.62 శాతం వృద్ధితో 1,03,557 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు 22.25 శాతం పెరిగి 1,32,570 యూనిట్లు, ట్రాక్టర్ విక్రయాలు 13.75 శాతం వృద్ధితో 76,906 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇదే సమయంలో ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా కూడా పెరిగింది. అన్ని విభాగాలను కలిపి ఈవీ రిటైల్ విక్రయాలు నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ఠంగా 3.34 లక్షల యూనిట్లకు చేరాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా సుమారు 13 శాతంగా ఉంది.
రానున్న నవరాత్రులు, దసరా పండుగల నేపథ్యంలో ఆటో డీలర్లు మరింత డిమాండ్‌పై ఆశాభావంతో ఉన్నారు. పితృపక్షం కారణంగా వాయిదా పడిన కొనుగోళ్లు పండుగల సమయంలో పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
