• ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కొంతకాలం తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసి అల్పాహారం చేస్తూ స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధానం, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  • పర్సంటేజీల ప్రాతిపదికన కాకుండా ఏ పార్టీకి ఏ ప్రాంతంలో బలం ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా పొత్తులు కొనసాగించాలని కూటమి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే నేతలు స్పష్టం చేశారు.
  • తొలి దశలో జరగనున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఎన్నికలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక, స్థానిక స్థాయిలో కమిటీల ఏర్పాటు వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
  • మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రాబోయే శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయం అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  • సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీలో ఎన్నికల వ్యూహం, కూటమి సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

By Rajini