విశాఖపట్నం, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 629 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులతో పాటు లైన్‌మెన్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో 445 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్లను కూడా విద్యుత్ శాఖలోకి తీసుకున్నామని చెప్పారు.

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పలువురికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు 1912 కాల్ సెంటర్‌ను పరిశీలించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి విద్యుత్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రూ.80 కోట్లతో నిర్మించిన **220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్)**ను మంత్రి ప్రారంభించారు.

ప్రతి విద్యుత్ ఫిర్యాదును నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి.. సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో మరింత వేగంగా స్పందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే 1912కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

By Ramya