ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేరాల నియంత్రణ, వీఐపీ భద్రత వంటి అంశాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తిరుపతి కమిషనరేట్‌లో నాలుగు జోన్లు

తిరుపతి పోలీస్ కమిషనర్‌గా ఐజీపీ లేదా డీఐజీ హోదా కలిగిన అధికారి వ్యవహరించనున్నారు. కొత్తగా నియమితులయ్యే సీపీకి బీఎన్‌ఎస్‌ఎస్‌ (BNSS), 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను ప్రభుత్వం కల్పించింది.

తిరుపతి పోలీస్ కమిషనరేట్ పరిధిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ పేర్లతో నాలుగు టెరిటోరియల్ జోన్లను ఏర్పాటు చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ, నేరాల నియంత్రణ, వీఐపీ భద్రత, శాంతిభద్రతలను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

తిరుపతి కమిషనర్ పోస్టు కోసం విజయవాడ సిటీ క్రైమ్స్ జాయింట్ సీపీ పోస్టును పునర్వ్యవస్థీకరించారు. మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టును డీసీపీ (తిరుమల)గా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టును డీసీపీ (శ్రీకాళహస్తి)గా మార్చారు. అలాగే విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పోస్టును డీసీపీ (తిరుపతి)గా, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును డీసీపీ (శ్రీసిటీ)గా పునర్నియమించారు.

ఏపీఎస్పీ బెటాలియన్ సీఎంటీ-1 పోస్టును డీసీపీ (కోఆర్డినేషన్)గా కేటాయించారు. జిల్లాలోని నాలుగు అదనపు ఎస్పీ పోస్టులను అదనపు డీసీపీ పోస్టులుగా, 12 డీఎస్పీ పోస్టులను ఏసీపీ పోస్టులుగా పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా ఎలాంటి పోస్టులను సృష్టించకుండానే తిరుపతి కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాజమహేంద్రవరం, గుంటూరు కమిషనరేట్లకు కీలక కేటాయింపులు

రాజమహేంద్రవరం పోలీస్ కమిషనరేట్‌కు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి సారథ్యం వహించనున్నారు. ఈ కమిషనరేట్‌కు నలుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలను ప్రభుత్వం కేటాయించింది.

గుంటూరు పోలీస్ కమిషనరేట్‌కు కూడా ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలను ప్రభుత్వం కేటాయించింది.

నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రతను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

By Rajini