వచ్చే పది రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారనుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.
సరస్ మేళాను విజయవాడలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో 650 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 2,500 మంది ప్రతినిధులు మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 13 నుంచి 30 వరకు సరస్ మేళా కొనసాగుతుందని చెప్పారు.
పున్నమి ఘాట్లో ఒకవైపు సరస్ మేళా, మరోవైపు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు ఎంపీ తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రత్యేక వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు సరస్ మేళా అద్దం పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ ఒకేసారి జరగడం నగరానికి పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుందని కేశినేని అన్నారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార కేంద్రాలను అందంగా అలంకరించుకోవాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు విజయవాడకు రానున్నారని కేశినేని తెలిపారు. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందించామని, ఇతర రాష్ట్రాల సీఎంల పర్యటన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందన్నారు.
ప్రముఖులు అమ్మవారి దర్శనానికి విజయవాడకు రావడం ద్వారా నగరానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పారు. వారి పర్యటనల సమయంలో కొంత ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు ఉండొచ్చని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూడు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు.