
గన్నవరం, జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అంతర్జాతీయ ఆర్చర్లు బొమ్మదేవర ధీరజ్, టి. గణేష్ మణిరత్నంలకు మంగళవారం గన్నవరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆర్చర్లు, పతక విజేతల తల్లిదండ్రులు విమానాశ్రయానికి చేరుకుని వారిని అభినందించారు. శాప్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎల్. వెంకట రమణ, ఎన్టీఆర్ జిల్లా స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కాకర్ల కోటేశ్వరరావు, ఏపీఏఏ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ఆర్చర్లను సత్కరించారు.
ధీరజ్ ప్రపంచకప్‌లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ ఈవెంట్లలో రెండు రజత పతకాలు సాధించాడు. గణేష్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నాడు. విజయవాడ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తున్న సందర్భంగా మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ కూడా ఆర్చర్లను అభినందించారు.
ఒలింపిక్స్‌పై ధీరజ్ గురి
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని ధీరజ్ తెలిపారు. ఇందుకోసం కఠినంగా శిక్షణ పొందుతున్నానని, రానున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శనతో ఒలింపిక్ బెర్త్ సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన విజయాల్లో తల్లిదండ్రులు, ఏపీఏఏ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ ప్రోత్సాహం కీలకమని పేర్కొన్నారు.
మిక్స్‌డ్ ఈవెంట్‌లో బెర్త్ లక్ష్యం
2028 ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ ఈవెంట్ ద్వారా బెర్త్ సాధించడమే తన లక్ష్యమని గణేష్ మణిరత్నం తెలిపారు. ఇందుకోసం శిక్షణను ముమ్మరం చేశానన్నారు. తల్లిదండ్రులు, ఆర్చరీ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించగలిగానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏపీఏఏ ఉపాధ్యక్షులు బొమ్మదేవర శ్రవణ్ కుమార్, గొట్టిపాటి ప్రేమ్ కుమార్, పలువురు ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, ఆర్చర్లు, ధీరజ్, గణేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
