• గోదావరి డెల్టా ఆధునికీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపే దిశగా రూ.13.4 కోట్లతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
  • ఇప్పటికే ఈస్ట్రన్ డెల్టా ఆధునికీకరణకు రూ.1,137 కోట్లు, సెంట్రల్ డెల్టాకు రూ.1,268 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వెస్ట్రన్ డెల్టాకు సంబంధించిన అంచనాలను కూడా త్వరగా సిద్ధం చేసి అందించాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్లు, బండ్‌ల స్థాయిలు, డీసిల్టింగ్ పనులు, లాక్‌లు, షట్టర్ల ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
  • పూడికతో మూసుకుపోయిన సీ మౌత్‌ల వద్ద డ్రెడ్జింగ్ పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి దిగువ ప్రాంతాల్లోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో సముద్రంలో కలిసే డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడిక తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
  • బ్రిటీష్ కాలంలో నిర్మించిన, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న లాక్‌లు, అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను గుర్తించి వాటికి మరమ్మతులు చేయడం లేదా అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టడంపై దృష్టి సారించాలని మంత్రి నిమ్మల తెలిపారు. లైడార్ సర్వే నిర్వహించిన ఐఐఎస్‌సీ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు డీపీఆర్‌లను సిద్ధం చేసే సమయంలో స్థానిక నీటి సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు.
  • క్షేత్రస్థాయి సమస్యలు, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. డీపీఆర్‌లు సిద్ధమైన అనంతరం వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

By Rajini