విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే ఏపీ హైకోర్టు ఇటీవల 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసి, ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

వైసీపీ అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితిలో లేకపోవడంతోనే కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ ఎన్నికలను ఆలస్యం చేయాలని చూస్తోందని వెంకన్న ఆరోపించారు. నవంబర్‌లోగా ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్‌ సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. బీసీల సమస్యల్లో జగన్‌ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించిన వెంకన్న.. రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా ఆయన తప్పుబట్టారు.

By Ramya