దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది. 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు నేరుగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా కళాశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం వారి ప్రాంగణాల నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ తదితర జిల్లాలకు ఈ ప్రత్యేక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులు ముందస్తుగా బస్సులను బుక్‌ చేసుకోవడానికి జేబీఎస్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ను సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సూచించారు.

దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తోంది. పండుగ సెలవుల సమయంలో బస్సుల్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ఈడీ శ్రీధర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుతూ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు దసరా సెలవులకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు నివసించే హాస్టళ్ల ప్రాంతాలు, కళాశాలల నుంచే నేరుగా ప్రత్యేక సర్వీసులను నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో విద్యార్థులు రద్దీగా ఉండే ప్రధాన బస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, సొంతూళ్లకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.

కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ప్రయాణికుల కోసం కూడా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్రాంతం నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఒకే గమ్యస్థానానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే.. వారి ప్రాంతానికే నేరుగా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయనుంది. దీంతో కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సమూహంగా కలిసి సొంతూళ్లకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట, కోదాడ, భద్రాచలం, ఖమ్మం, ఆర్మూర్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు కావాల్సిన వారు సంబంధిత డివిజనల్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

దసరా సెలవుల సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే బస్సులను బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ ప్రయాణ తేదీ, గమ్యస్థానం, ప్రయాణికుల సంఖ్యను ముందుగానే తెలియజేస్తే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో చివరి నిమిషంలో బస్సుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

ప్రత్యేక సర్వీసులు, బస్సుల బుకింగ్‌కు సంబంధించిన వివరాల కోసం జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) జోనల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ను 9959226160 నంబరులో సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసుల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.