• అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హిందూపురం వైసీపీ మాజీ అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ పార్టీకి రాజీనామా చేశారు.
  • ఈ మేరకు శుక్రవారం వైసీపీ అధిష్ఠానానికి ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. అయితే ఏడాది క్రితమే నవీన్ నిశ్చల్‌పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.
  • నవీన్ నిశ్చల్ గతంలో హిందూపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా, అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వరుసగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచినా విజయం సాధించలేకపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆగ్రోస్ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
  • తాజా రాజీనామాతో హిందూపురం రాజకీయాల్లో నవీన్ నిశ్చల్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన తదుపరి రాజకీయ కార్యాచరణ ఏమిటన్న దానిపై పుట్టపర్తి జిల్లాలో ఆసక్తి నెలకొంది.

By Rajini