తెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ సంస్థలను లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ప్రతిపాదన కూడా లేదని వెల్లడించారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరినప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దీంతో తెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక స్పష్టత ఇచ్చారు. డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. ఈ సంస్థలను లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ప్రతిపాదన కూడా లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో డిమాండ్ ఈ స్థాయికి చేరిందని భట్టి విక్రమార్క వివరించారు. కర్ణాటకలో సుమారు 15 వేల మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 13 వేల మెగావాట్ల డిమాండ్ ఉండగా.. తెలంగాణలో విద్యుత్ వినియోగం మరింత ఎక్కువగా ఉందన్నారు. ఇంతటి డిమాండ్‌ను ఎదుర్కొంటూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలను ప్రైవేటీకరించడం లేదా వాటిని లిస్టెడ్ కంపెనీలుగా మార్చడం వంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఆయన తెలిపారు. విద్యుత్ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేసి, వాటి సామర్థ్యాన్ని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.

విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును కించపరిచేలా రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదని భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.