ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే విస్తృతంగా చర్చించారు. గురువారం సచివాలయంలోని ఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ శాఖ కార్యాలయానికి వచ్చిన నితేష్ రాణేకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సీఈ రాఘవరావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
అనంతరం ఏపీ అధికారులు మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి రాష్ట్రంలోని గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, పీపీపీ విధానం, నూతన మారిటైమ్ పాలసీపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల్యాండ్ లార్డ్ మోడల్లో మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వ విధానాన్ని నితేష్ రాణే ప్రశంసించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు మౌలిక వసతులు కల్పించి, కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఒక్కో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సుమారు రూ.4,500 కోట్ల పెట్టుబడితో 2027 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి సముద్రతీరం లేని రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు ఆంధ్రప్రదేశ్ పోర్టులు కీలకంగా మారనున్నాయని చెప్పారు. దుగరాజపట్నం, మచిలీపట్నంలో షిప్‌బిల్డింగ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, కాకినాడలో షిప్‌బిల్డింగ్‌కు సంబంధించిన ప్రతిపాదన పురోగతిలో ఉందని బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు.
మత్స్యకారుల సంక్షేమంపై చర్చ
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్న విధానంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే ఆసక్తి వ్యక్తం చేశారు. విజయవాడ అమరావతి వాటర్ మెట్రోకు అనుమతులు, సీప్లేన్ సేవల కోసం తొమ్మిది ప్రాంతాల గుర్తింపు, శ్రీశైలం విజయవాడ మధ్య ట్రయల్ రన్ వంటి అంశాలను బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు.
రాయలసీమలోని హార్టికల్చర్ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. తీరప్రాంతంలో ఉన్న 20 వేల ఎకరాల ఉప్పు భూములను వినియోగించుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు అధికారులు వెల్లడించారు.