పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్రం ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఈ హైవే మొత్తం 1,107 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో ఏపీ పరిధిలో 457 కిలోమీటర్లు ఉంటుంది.

ప్రస్తుత ఎలైన్‌మెంట్‌ ప్రకారం హైవే అరకు, పాడేరు, చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు, జంగారెడ్డిగూడెం, పట్టిసీమ మీదుగా అగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానం కానుంది.

అయితే పట్టిసీమకు బదులుగా పోలవరం మీదుగా హైవేను మళ్లించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. పోలవరం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించి హైవేను అనుసంధానిస్తే.. పోలవరం ప్రాజెక్టుకు మెరుగైన కనెక్టివిటీతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రుల వద్ద ఈ ప్రతిపాదనను ప్రస్తావించే అవకాశం ఉంది. పోలవరం మీదుగా హైవే వెళితే ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఎగుమతులు కూడా సులభతరం అవుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఈ ప్రాజెక్టు కోసం 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టనున్నారు. భూసేకరణ, పునరావాసానికి రూ.8,982 కోట్లు, సివిల్‌ పనులకు రూ.55,772 కోట్లు కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.75,629 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఏపీ పరిధిలోని 457 కిలోమీటర్లకు సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

By Ramya