విజయవాడ:అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ప్రాణాలను కాపాడేందుకు విజయవాడకు చెందిన 350 మంది నూతన పోలీస్‌ కానిస్టేబుళ్లకు బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌), కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)పై శిక్షణ ఇచ్చారు.

పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర బాబు, ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌ బేగం ఆధ్వర్యంలో ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ నిపుణుడు డాక్టర్‌ కార్తికేయన్‌ జంపాల శిక్షణ అందించారు.

ఆకస్మిక గుండె ఆగిపోవడం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయం అందేలోపు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలను కానిస్టేబుళ్లకు వివరించారు. ఛాతీపై ఒత్తిడి చేయడం, సీపీఆర్‌ నిర్వహణ, అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం వంటి అంశాలను ప్రాయోగికంగా నేర్పించారు.

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పోలీసులకు ఈ ప్రాణరక్షణ నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆపద సమయంలో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశమన్నారు.

ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ సీఎస్‌ఆర్‌లో భాగంగా పౌరులు, అత్యవసర సేవల సిబ్బంది, విద్యార్థులకు కూడా బీఎల్‌ఎస్‌, సీపీఆర్‌పై శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *