
తిరువూరు: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0లో భాగంగా తిరువూరు పట్టణానికి మంజూరైన 112 ఇళ్లకు సంబంధించిన అనుమతి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
తిరువూరులోని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సొంత ఇల్లు పేద కుటుంబాలకు గౌరవం, భద్రతకు ప్రతీక అని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయం అందడంతో తమ కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
