
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకముందే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని వైసీపీని ప్రశ్నించారు. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడం అవగాహన రాహిత్యమని విమర్శించారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ నెలలోనే స్థానిక ఎన్నికలు?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో జరిగే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి పెడతామని చెప్పారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఆయన ఆరోపించారు.
34 శాతం బీసీ రిజర్వేషన్ల నేపథ్యం
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొత్త విషయం కాదు. 1994లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. 1995, 2001, 2006, 2013లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవి అమలయ్యాయి.
అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లలో మార్పులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు.
దీంతో బీసీలకు వేలాది రాజకీయ పదవులు దూరమయ్యాయనే విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తిరిగి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం 34 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
