
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీకి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓవీ రమణను విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఓవీ రమణ, విజయసాయిరెడ్డి కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే పార్టీ పేరు, జెండాను అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. పార్టీ ప్రారంభానికి ముందుగా విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కొత్త పార్టీ విధివిధానాలతో పాటు ఆయా ప్రాంతాల సమస్యలు, వాటి పరిష్కారాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు తమ కొత్త పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాజాగా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అనంతరం కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం, శ్రేయస్సే తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు, వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు.
కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో తనతో కలిసి పనిచేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తామిద్దరం నాలుగేళ్ల పాటు టీటీడీ పాలకమండలి సభ్యులుగా కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఓవీ రమణ తన ఆహ్వానాన్ని అంగీకరిస్తే, రాజకీయ ప్రయాణంలో కలిసి ముందుకు సాగి విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రమణతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని తెలిపారు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓవీ రమణ.. ఇటీవల పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఆయనను తన కొత్త పార్టీలోకి ఆహ్వానించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, విజయసాయిరెడ్డి ఆహ్వానంపై ఓవీ రమణ స్పందించారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. కాగా, విజయసాయిరెడ్డి, ఓవీ రమణ ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
