కొండపి, శుక్రవారం ఒక నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు కీలక నాయకులు ఉన్నప్పుడు వారంతా సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఫలితాల్లో తేడా వచ్చాక క్షమాపణలు చెబితే ఉపేక్షించబోనని, అలాంటి వారితో ఆ తర్వాత మాట్లాడనని హెచ్చరించారు.

తన వద్ద సేవచేసేవారికి, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పారు. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పాలేరు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు శుక్రవారం కొండపి నియోజకవర్గానికి వచ్చారు. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం జరుగుమల్లి మండలం నర్సింగోలులో నియోజకవర్గ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, పాలనకు సంబంధించిన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొండపి ఎమ్మెల్యేగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ (సత్య) నియోజకవర్గ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.

ఇటీవల వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నప్పుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

మంత్రి స్వామి మంచివారని, సౌమ్యుడని పేర్కొంటూ, పార్టీని బలోపేతం చేయడంలో సమర్థుడిగా పేరున్న సత్య ఆయనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని హితవు పలికారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *