
హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయా కారిడార్ల అలైన్‌మెంట్ అధ్యయనాల పురోగతితో పాటు తెలంగాణలో రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై చర్చించారు. సూర్యాపేట మీదుగా రైలు మార్గం నిర్మాణంపై కూడా ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. అలైన్‌మెంట్లు ఖరారైన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులకు పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. అధికారిక నిర్ణయం తీసుకోకముందే భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి భూసేకరణ చేపట్టనున్నారన్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మూడు కారిడార్లకు సంబంధించిన మార్గాల ఎంపిక (అలైన్‌మెంట్)పై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయ్యాకే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు
ఢిల్లీలోని రైల్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదనలు, అలైన్‌మెంట్ అధ్యయనాల పురోగతి, తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఆందోళనలపై చర్చించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే తమ అధికారిక ఎక్స్ ఖాతాల ద్వారా వెల్లడించారు.
హైస్పీడ్ రైలు మార్గాల కోసం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు చేపట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూములు కోల్పోతామనే భయంతో పలువురు రైతులు తనను కలిసి సమస్యలను వివరించినట్లు రైల్వే మంత్రికి తెలియజేశారు. తొలుత రూపొందించిన అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను కూడా చేర్చినప్పటికీ, ఆ తర్వాత మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. తమ ప్రాంతం మీదుగా కూడా హైస్పీడ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సూర్యాపేట ప్రజలు తనను సంప్రదిస్తున్నారని వివరించారు.
భూసేకరణపై నెలకొన్న అనిశ్చితి క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలకు దారితీస్తోందని కిషన్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారిపై కారంపొడి చల్లిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు తెలిపారు. అలైన్‌మెంట్ ఖరారు కాకముందే భూముల గుర్తింపు, మార్కింగ్ పనులు చేపట్టడంపై స్పష్టత లేకపోవడం రైతుల్లో సందేహాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్ అధ్యయనాలు కొనసాగుతున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి స్పష్టం చేసినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. మార్గాలు ఖరారైన తర్వాతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు, రైతులకు పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
