
కేంద్రమంత్రి బండి సంజయ్ భవానీ మాలధారణ చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మాల ధరించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వరకు ఆలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక టెంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు. రోజుకు 5 వేల నుంచి 10 వేల మంది భక్తులకు ఆహారం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష స్వీకరించారు. శుక్రవారం ఉదయం సుమారు 10 గంటలకు వేద పండితుల ఆశీర్వచనాల మధ్య భవానీ మాలధారణ చేసిన ఆయన.. ఎర్రని వస్త్రాలు ధరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వరకు 11 రోజుల పాటు దీక్షలో కొనసాగాలని నిర్ణయించుకున్న బండి సంజయ్.. ఈ కాలమంతా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో గడపనున్నారు.
దీక్షా సమయంలోనూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. వివిధ సమస్యలతో తనను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేశారు. ఒకవైపు దీక్షా నియమాలను పాటిస్తూ అమ్మవారి సేవలో పాల్గొంటూనే.. మరోవైపు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భవానీ దీక్షాధారులకు పూజా సౌకర్యాలు, భోజన వసతులు కల్పించడంతో పాటు సాధారణ భక్తుల సౌకర్యాలపైనా దృష్టి పెట్టారు.
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజూ విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శుక్రవారం కావడంతో ఆలయానికి భవానీ దీక్షాధారులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, వివిధ ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
