
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నేత, రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాశ్ కీలక విశ్లేషణ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు చేరువగా ఉన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం పార్టీలో అసంతృప్తికి కారణమైందన్నారు. గద్దర్‌తో తలెత్తిన వివాదం కూడా పార్టీకి ప్రతికూలంగా మారిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని బీజేపీ సవాలుగా భావించిందని విశ్లేషించారు. అదే సమయంలో బీజేపీ బలహీనపడటం కాంగ్రెస్‌కు రాజకీయంగా కలిసొచ్చిందని వి. ప్రకాశ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తూ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, తిరిగి పట్టు సాధించి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. చివరకు ఎందుకు ఓటమి పాలైంది? కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ పతనానికి ఎలా కారణమయ్యాయి? బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర ఎంత? వంటి అంశాలపై బీఆర్ఎస్ నేత, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఓటమికి దారితీసిన పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాలు పార్టీ ఓటమికి కారణమయ్యాయని ఆ పార్టీ నేత, రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరితో కలిసిమెలిసి ఉండే కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలో తనతో కలిసి భోజనం చేసిన నేతలు, కార్యకర్తలకు సైతం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఏర్పడిందని, దీంతో వారిలో అసంతృప్తి పెరిగిందని వివరించారు.
దీనికి తోడు గద్దర్ వ్యవహారం కూడా కేసీఆర్‌కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని వి. ప్రకాశ్ అన్నారు. కేసీఆర్ ఇంటి ముందు గద్దర్ కూర్చున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వాటిని రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం బీఆర్ఎస్పై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషించారు.
మరోవైపు, బీఆర్ఎస్ను జాతీయ స్థాయికి విస్తరించాలన్న కేసీఆర్ ప్రయత్నం బీజేపీకి సవాలుగా మారిందని వి. ప్రకాశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయడంతో దేశవ్యాప్తంగా కేసీఆర్‌పై ఆసక్తి పెరిగిందని, ముఖ్యంగా రైతులు ఆయన వైపు చూశారని పేర్కొన్నారు. ఈ పరిణామాలను బీజేపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే బీజేపీ తన బలాన్ని తగ్గించుకుందని వి. ప్రకాశ్ ఆరోపించారు. అప్పటివరకు రాష్ట్రంలో సుమారు 40 స్థానాల్లో ప్రభావం చూపగలదని భావించిన బీజేపీ, బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత వెనుకబడిందని పేర్కొన్నారు. చివరకు బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కావడం, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్ల సమీకరణ జరగడం బీఆర్ఎస్ ఓటమికి దారితీశాయని ఆయన విశ్లేషించారు.
