
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష నిర్వహించారు. రాజేంద్రనగర్లోని తన నివాసంలో దేవాదాయ శాఖ అధికారులు, వివిధ ఆలయాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో సమావేశమై ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల ఉత్సవ బుక్లెట్లను ఆవిష్కరించగా, వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంపొందించేలా శరన్నవరాత్రి ఉత్సవాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆలయాల పరిసరాల్లో తాగునీటి సదుపాయం, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణతో పాటు భక్తుల రాకపోకలకు అనుకూలమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక వేడుకలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ సమావేశంలో జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, దేవాదాయ శాఖ ఈవో కందుల గోపాలరావు, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పట్టపు చిన్న, గౌరీ శంకర స్వామి దేవస్థానం చైర్మన్ లోయ బోసు, వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ అంగడాల సతీష్, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లింగం చిట్టిబాబు, వేద పండితులు లంక విజయ్ సాయి చందు, లంకా జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
