
తెలంగాణలో భూముల సమగ్ర రీ సర్వేను 18 నెలల్లో పూర్తి చేసి, భూ వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్వే పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని ఏడు జోన్లలో 14 మంది అధికారులను నియమించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేసి, సర్వే పురోగతిని రోజువారీగా రియల్‌టైంలో పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో నక్షా పటాలు లేని 365 గ్రామాల్లో భూముల సర్వే చేపట్టగా, మరో 2,240 గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. ఎర్రవల్లిలో అసైన్డ్ భూముల మార్పిడి, భూముల విస్తీర్ణంలో తలెత్తిన వ్యత్యాసాలకు సంబంధించిన అంశాలపైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. సమగ్ర భూ సర్వే ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెంచడంతో పాటు, భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీ సర్వేను 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రీ సర్వే కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
సచివాలయంలో భూముల సమగ్ర రీ సర్వే ఏర్పాట్లు, పర్యవేక్షణ, పనుల పురోగతిపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. భూ రికార్డుల్లో స్పష్టత తీసుకురావడంతో పాటు, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో భూముల సమగ్ర రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా విభజించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి జోన్‌కు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరి చొప్పున మొత్తం 14 మంది అధికారులను పర్యవేక్షణ బాధ్యతల్లో నియమించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రీ సర్వే పనులను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో ప్రతిరోజూ చేపడుతున్న సర్వే వివరాలు రియల్‌టైంలో అందుబాటులో ఉండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంబంధిత గ్రామాల్లో తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రీ సర్వే పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు.
ప్రభుత్వ భూముల సర్వే సందర్భంగా సరిహద్దుల గుర్తింపు ప్రక్రియకు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. రీ సర్వే పేరుతో ప్రజల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించి, భూ యజమానులకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నక్షా పటాలు లేని 365 గ్రామాల్లో ఇప్పటికే భూముల సమగ్ర రీ సర్వేను ప్రారంభించినట్లు పొంగులేటి వివరించారు.
రాష్ట్రంలో భూముల సమగ్ర రీ సర్వే కార్యక్రమం మరింత వేగంగా కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాల్లో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు పేర్కొన్నారు. భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలపై స్పష్టత తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితర అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో అసైన్డ్ భూములకు సంబంధించిన అంశంపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. గ్రామంలో సుమారు 31 శాతం అసైన్డ్ భూములు చేతులు మారినట్లు గుర్తించామని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు. మొత్తం 385 ఎకరాల భూమికి సంబంధించి 45 ఎకరాల మేర విస్తీర్ణ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మరికొందరికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. భూముల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలపై స్పష్టత కోసం మరోసారి సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
