తిరుమల శ్రీవారికి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు భారీ విరాళాన్ని అందజేశారు. రూ.51.55 లక్షల విలువైన రత్నాలు పొదిగిన బంగారు పతకం, ముత్యాల హారాన్ని భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించారు. ఈ ఆభరణాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. మరోవైపు, తిరుమల శ్రీవారి పేరిట నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు పలువురు భక్తులు విరాళాలు అందించి తమ భక్తిని చాటుకున్నారు.

తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు, విలువైన కానుకలు సమర్పించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని స్వామివారికి విరాళంగా అందజేశారు.

ఈ కానుకల్లో రూ.44.35 లక్షల విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్‌తో పాటు, రూ.7.20 లక్షల విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారం ఉన్నాయి. మొత్తం 174 గ్రాముల బరువున్న ఈ ఆభరణాలను దాతలు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఉత్సవమూర్తుల అలంకరణకు వినియోగించనున్నారు.

టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం

తిరుమల శ్రీవారి పేరుతో నిర్వహిస్తున్న టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు మరో భారీ విరాళం అందింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దాత హర్షవర్ధన్ రెడ్డి ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఆయన తరఫున టీటీడీ పాలకమండలి సభ్యుడు నన్నపనేని సదాశివరావు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డీడీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందించారు. టీటీడీ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న హర్షవర్ధన్ రెడ్డికి ఈ సందర్భంగా ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని వకుళామాత వంటశాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఫుడ్ కౌంటర్లకు సకాలంలో అన్నప్రసాదాలు సరఫరా చేస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు, అదనపు ఈవో సీహెచ్ తిరుమలలోని గోశాలను సందర్శించి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. గోవుల సంరక్షణ, వాటి ఆరోగ్య పరిస్థితులు, పాల ఉత్పత్తి సామర్థ్యం, పశుగ్రాసం నిల్వలు, ఇతర అవసరాలపై అధికారులతో చర్చించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

తిరుమల గోశాలలో ప్రస్తుతం సుమారు 100 గోవులు ఉన్నాయని, వాటి ద్వారా రోజుకు దాదాపు 90 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ నిర్వహించే నవనీత సేవకు అవసరమైన సుమారు 1.5 కిలోల వెన్నను కూడా గోశాల నుంచే సమకూరుస్తున్నట్లు వివరించారు. నవనీత సేవకు సంబంధించిన ఊరేగింపు గోశాల నుంచే ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే ఏనుగులు, గుర్రాలు, ఎద్దుల సంరక్షణ, ఆరోగ్య పరిస్థితులు, ఉత్సవాల్లో పాల్గొనేందుకు వాటికి అందిస్తున్న శిక్షణ, సన్నద్ధతను కూడా ఆయన పరిశీలించారు. జంతువుల సంరక్షణలో సిబ్బందికి ఉన్న అనుభవంతో పాటు, వాటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జంతువులకు అవసరమైన వైద్య సదుపాయాలు, వెటర్నరీ నిపుణుల సేవలు అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోవులకు అవసరమైన పశుగ్రాసం, ఇతర వసతులను పటిష్ఠంగా సమకూర్చుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *