• స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, వైసీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ హైకోర్టును ఆశ్రయించకపోయి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జరిగి ఉండేవని పేర్కొన్నారు.
  • శనివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఈ ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే ఎన్డీయే కూటమి ఉద్దేశమని స్పష్టం చేశారు. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వాల నిర్ణయాలు

  • బీసీలకు మొదటి నుంచి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీయేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 1987లో ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచినట్లు తెలిపారు.
  • అయితే గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని మంత్రి విమర్శించారు. బలహీనవర్గాల ప్రయోజనాల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 2019లో బీసీలపై జరిగిన దాడులు, వేధింపులు గతంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. బీసీల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని అన్నారు.

స్థానిక ఎన్నికలపై వైసీపీకి భయం: అచ్చెన్నాయుడు

  • స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పార్టీకి మిగిలిన కొద్దిమంది నాయకులు కూడా వెళ్లిపోతారనే భయం వైసీపీలో మొదలైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకే ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
  • బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించకపోయి ఉంటే, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదని మంత్రి పేర్కొన్నారు. బలహీనవర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *