స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తిరుపతిలోని జిల్లా పోలీసు కార్యాలయ పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం రాయలసీమ రేంజ్ పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా ఏర్పాట్లపై ఈ సందర్భంగా సమీక్షించారు.
సమస్యాత్మక వ్యక్తులపై ముందస్తు చర్యలు
గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి చట్టపరిధిలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు గ్రామసభలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతపై నమ్మకాన్ని పెంపొందించాలని చెప్పారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అంతర జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేసి, వాహన తనిఖీలను విస్తృతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వదంతులపై నిఘా
సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, విద్వేషపూరిత పోస్టులతో అశాంతిని సృష్టించే ప్రయత్నాలను ఉపేక్షించరాదని డీజీపీ హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అదనపు బలగాలను మోహరించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్ట్రైకింగ్ ఫోర్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
పోలింగ్ ముగిసిన వెంటనే భద్రతా బలగాలను ఉపసంహరించకూడదని, శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
భయంలేకుండా ఓటు వేసేలా చర్యలు
ప్రతి గ్రామం, వార్డులోని పరిస్థితులపై పోలీసు అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీసుల బాధ్యతని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీజీపీ మధుసూదన రెడ్డి, అనంతపురం రేంజ్ ఐజీ డాక్టర్ షీమోసీ బాజ్‌పాయ్, డీఐజీలు కోయ ప్రవీణ్, విక్రాంత్ పాటిల్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.