సీఈసీ రాజీనామా కోరుతూ ఢిల్లీలో సీజేపీ చేపట్టాలని భావించిన నిరసనను పోలీసులు అడ్డుకుంటున్నారు. జులైలో నీట్ ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. దీంతో నిరసన కార్యక్రమాల బాధ్యతలను పార్టీ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్‌కు అప్పగించినట్లు అభిజిత్ దీప్కే వెల్లడించారు. ఈ మేరకు ఆయన ముందుగా రికార్డు చేసిన వీడియోను సీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టనున్న నిరసనల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అగ్రనేతలు పోలీసుల అదుపులోకి వెళ్లడంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను పార్టీ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ అజింక్య షిండేకు అప్పగించారు. ఇతర నేతలు విడుదలయ్యే వరకు నిరసనలకు అజింక్యనే నాయకత్వం వహిస్తారని శనివారం విడుదల చేసిన ముందస్తుగా రికార్డు చేసిన వీడియోలో దిప్కే వెల్లడించారు.

ప్రీ-రికార్డెడ్ వీడియోలో దిప్కే సందేశం

ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దిప్కేను విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే CJP అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘మీరు ఈ వీడియో చూస్తున్నారంటే.. నేను, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టయ్యామని అర్థం. మా గైర్హాజరీలో అజింక్య ఈ నిరసనతో పాటు CJP ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారు. ఆయన నాయకత్వాన్ని అనుసరించండి’’ అని దిప్కే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోకి ప్రవేశించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఉద్యమాన్ని కొనసాగించేందుకు దిప్కే ముందుగానే నాయకత్వ బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎవరీ అజింక్య షిండే?

మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన అజింక్య షిండే.. అభిజీత్ దిప్కేకు సుదీర్ఘకాలంగా సన్నిహిత సహచరుడిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో పూర్తిస్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016లో గోవాలో తొలిసారిగా దిప్కేను కలిసిన ఆయన.. ఆ తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున చురుగ్గా పనిచేశారు. అనంతరం ఆప్ మహారాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం CJP ఉద్యమ బాధ్యతలు ఆయనకు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా CJP చేపట్టిన నిరసన కార్యక్రమం ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, బస్సుల్లో ఎక్కించి ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.

నిరసనకు ముందస్తు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో సుమారు 400 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు, జర్మనీ నుంచి భారత్‌కు వచ్చి ఇటీవల బెంగళూరులో జరిగిన CJP నిరసనలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో నిర్బంధించినట్లు కథనాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *