
ఫ్లై దుబాయ్ విమానంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించింది. విమానంలో చోటుచేసుకున్న పరిణామాలు, దాడి వెనుక ఉన్న కుట్ర కోణాలను ఎన్ఐఏ పరిశీలించనుంది.
174 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్
గత సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అడ్డుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆయన తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన సాహసంతో విమానంలోని 174 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఘటన అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాకు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం.
యాంటీ హైజాకింగ్ చట్టం కింద దర్యాప్తు
ఈ ఘటనపై ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియా అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం కూడా ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. యాంటీ హైజాకింగ్ చట్టం, 2016లోని సెక్షన్ 3తోపాటు సంబంధిత నిబంధనల ప్రకారం కేసును పరిశీలించనుంది.
విమానంలో ఏం జరిగింది? ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఇతరుల ప్రమేయం ఉందా? అనే అంశాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. విచారణ అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
