ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అనుసరించాల్సిన మార్గాలపై మంత్రివర్గం సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదిక ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

బీసీల జనాభా 2.65 కోట్లకు పైగా

మిశ్రా కమిషన్ నివేదికలో పేర్కొన్న బీసీల జనాభా గణాంకాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభా 5.27 కోట్లు కాగా, బీసీల సంఖ్య 2.65 కోట్లకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 50.42 శాతంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో బీసీల జనాభా 48.84 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 54.36 శాతంగా ఉన్నట్లు నివేదికలో పొందుపరిచిన గణాంకాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లపై తదుపరి అడుగులపై దృష్టి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో బీసీల జనాభా గణాంకాలు, సామాజిక వెనుకబాటుతనం, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మిశ్రా కమిషన్ నివేదికలోని వివరాలను పరిశీలిస్తూ, రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *